3 రోజులు జాగ్రత్త.. తెలంగాణలో ఉష్ణోగ్రతల పెరుగుదల
తెలంగాణ,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇవాళ నుంచి ఈనెల 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఎండలు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల వరకు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే తూర్పు మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 39 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ఎండల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలపై కప్పు లేదా టోపీ ధరించడం, తరచూ నీరు తాగడం, శరీరానికి తేమ కలిగించే పానీయాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎండల ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలని సూచించారు.









