ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ అంకిత్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 10 ఆధాబ్ న్యూస్:
జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పరీక్షలు కావడంతో నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలకు 12,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయని చెప్పారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బి అమలు చేయడంతో పాటు జిరాక్స్ కేంద్రాలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, డీపీఓ సుధీర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!