కరకగూడెం మండలం అనంతారం కాంప్లెక్స్‌లో ఘనంగా FLN బాలమేళా 2.0, గ్రంథాలయ అభ్యసన పండుగ ప్రారంభం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం, అనంతారం కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని FLN బాలమేళా 2.0 మరియు గ్రంథాలయ అభ్యసన పండుగ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు జి. పద్మావతి అధ్యక్షత వహించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బాలమేళా భాగంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, గణితం విషయాల్లో సామర్థ్య ఆధారిత రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పాఠశాల నుంచి ప్రతి తరగతి నుండి ఒక విద్యార్థి కాంప్లెక్స్ స్థాయిలో ఈ పరీక్షలకు హాజరవుతారు.
ఇక గ్రంథాలయ అభ్యసన పండుగలో భాగంగా విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కథా విన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రంథాలయంలోని కథలను ఎంపిక చేసుకుని, హావభావాలతో కథ చెప్పే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి తరగతి నుంచి ఒక విద్యార్థిని ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తున్నారు.
ప్రతి తరగతి నుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొననున్నారు. అందులో ఒకరు రాత పరీక్షకు, మరొకరు కథా విన్యాసానికి పాల్గొంటారు. ఒకే విద్యార్థి ఉన్న పాఠశాలల్లో ఆ విద్యార్థి రెండు విభాగాల్లోనూ పాల్గొనే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, వారి ప్రతిభను వెలికితీయడానికి వేదికగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
“విద్యార్థుల పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తు బలంగా ఉంటుంది” అనే లక్ష్యంతో FLN కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ జి. వెంకటేశ్వర్లు, బి. బావ్ సింగ్, కె. సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.









