బాణాసంచాలపై నిషేధం: సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు
హైదరాబాద్,మే 9ఆధాబ్ న్యూస్:
దేశవ్యాప్తంగా భద్రతాపరమైన హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఐపీఎస్ తాజా ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితులు మరియు ఉగ్రవాద చర్యల నేపథ్యంలో, బాణాసంచాల శబ్దాలు ప్రజల్లో భయాందోళన కలిగించే అవకాశం ఉందని, ఇది అత్యవసర సమయాల్లో భద్రతా చర్యలకు అడ్డంకిగా మారవచ్చని పోలీస్ శాఖ వెల్లడించింది.
“పబ్లిక్ ప్రదేశాల్లో, ముఖ్యంగా సైనిక కాంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధించబడింది,” అని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈ నిషేధం వెంటనే అమలులోకి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించారు. నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పబ్లిక్ సహకారం అత్యంత అవసరమని, ఎవరు కూడా బాణాసంచా కాల్చకుండా సమాజానికి తగిన బాధ్యత చూపించాలని కోరారు









