ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ లో ఉద్యోగుల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్.

సామాజిక సేవకుడు కర్నే బాబురావు వినతిపత్రం సమర్పణ.

కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ : సింగరేణి ఉద్యోగులకు ఆధ్యాత్మిక స్థలంలా భావించబడే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో ఉద్యోగుల రాకపోకలపై విధిస్తున్న ఆంక్షలను వెంటనే తొలగించాలని మణుగూరుకు చెందిన సామాజిక సేవకుడు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్), ఇన్‌చార్జ్ డైరెక్టర్ పా. కొప్పుల వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాబురావు, “హిందువులకు దేవాలయాలు, ముస్లింలకు మసీదులు, క్రైస్తవులకు చర్చిలు, సిక్కులకు స్వర్ణదేవాలయం ఎంత పవిత్రంగా ఉంటాయో, సింగరేణి ఉద్యోగుల హృదయాల్లో హెడ్ ఆఫీస్ అంతే పవిత్రమైన స్థానం,” అని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు హెడ్ ఆఫీస్ కి రావడం సహజమన్నారు. అయితే, ప్రస్తుతం సెక్యూరిటీ విభాగం విధిస్తున్న ఆంక్షలు వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ కార్మికులు, కార్మిక నేతల పట్ల కూడా చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని, వారు హెడ్ ఆఫీస్ కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలన్నా, సెక్యూరిటీ వారు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, ఫోటోలు తీసే సెల్‌తో గార్డును వెంట పంపుతున్నారని, ఇది అతి అవమానకరమని తెలిపారు. ఆలయాల్లో దళితులకు ప్రవేశం నిషేధించిన వార్తలు ఎప్పుడైనా వింటే ఏవిధంగా ఉంటుందో, ప్రస్తుతం హెడ్ ఆఫీస్ లో ఉద్యోగుల పరిస్థితి అదే తరహాలో ఉందన్నారు.

కాంట్రాక్టర్లు, లాబీయిస్టులు కార్లలో వచ్చినప్పుడు వారిని ఆపకుండా సలాం కొట్టి లోపలికి పంపిస్తారని, కానీ ద్విచక్ర వాహనాలు లేదా కాలినడకన వచ్చే ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితులు సంస్థ పట్ల ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత మార్పు వస్తుందని ఉద్యోగులు ఆశించారని, అయితే పరిస్థితి తిరిగి పురాతన స్థితికి వెళ్లిందని అన్నారు. ఉద్యోగులు తమ కష్టాలను పంచుకునే అవకాశం కోల్పోతున్నారని, ఇది సంస్థ శ్రేయస్సుకు కూడా విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా GM (పర్సనల్, IR & PM) కవితా నాయుడు వ్యవహారశైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మిక నాయకులు ఫోటో దిగే దృక్పథాన్ని ఆమె నిరాకరిస్తున్నారని, కనీస మర్యాద కూడా చూపించకపోవడం బాధాకరమన్నారు.

“ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కూడా ప్రజలతో నవ్వుతూ ఫోటోలు దిగుతున్నారు. అలాంటి ఉదారత అధికారుల దగ్గర కూడా ఉండాలి. వినతిపత్రం అందుకుంటూ ఒక ఫోటో దిగితే పోయేదేమీ లేదు. ఎదుటివారికి ఎంతో సంతృప్తి కలుగుతుంది,” అని బాబురావు వ్యాఖ్యానించారు.

తుది గమనికగా, పరిస్థితి మారకపోతే హైదరాబాద్ లోని సింగరేణి ఎండి ని కలిసి సమస్యను వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో సింగరేణి అధికారుల దృష్టికి ఈ అంశం వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ సంబంధిత అధికారులు త్వరితగతిన స్పందించాలన్నది కార్మికుల ఆకాంక్ష.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!