తాళ్లగొమ్మూరు గ్రామం సాక్షిగా – సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు రేషన్ సన్న బియ్యంతో వంటకాల రుచి
ఆధాబ్ న్యూస్,భద్రాచలం:
బూర్గంపాడు మండలానికి చెందిన సారపాకలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో నేడు ఓ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బూరం శ్రీనివాస్ రేషన్ షాపు నుండి పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారు చేసిన వంటకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భోజనం చేశారు.
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన శాసన సభ్యులు మంత్రివర్యులు కూడ ఒంటిగంట 25 నిమిషాలకు గ్రామానికి చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు.
తర్వాత సన్న బియ్యంతో చేసిన వంటకాలను స్వయంగా చవిచూసి, రేషన్ ద్వారా పంపిణీ చేయబడుతున్న బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ముఖ్యమంత్రితో మాట్లాడి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇది గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సంఘటనగా నిలిచింది.









