పినపాక,ఆధాబ్,న్యూస్ :
పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో గత ఆరు రోజులుగా జరిగిన జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ లో అగ్నిమాపక జట్టు విజేతగా నిలిచింది.
శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అగ్నిమాపక జట్టు, బిటిపీఎస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన బిటిపీఎస్ జట్టు పది ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. 69 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అగ్నిమాపక జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అగ్నిమాపక జట్టు క్రీడాకారుడు మధుకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, టోర్నమెంట్ ఆసాంతం అసాధారణ ప్రదర్శన చేసిన బిటిపీఎస్ జట్టు క్రీడాకారుడు రమేష్కి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.
విజేతలకు పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గత పది సంవత్సరాలుగా జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం. ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. అలాగే, నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులు ఇలాంటి క్రీడలలో పాల్గొనడం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు” అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి క్రాంతి కుమార్, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఎన్.ఆర్.ఐ. కూనారపు ప్రసాద్, వినోద్ కుమార్, సతీష్ రెడ్డి, వెంకటరెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు బిల్లా నాగేందర్, భూరా శంకర్, కీసర సుధాకర్ రెడ్డి, ముక్కు మహేష్ రెడ్డి, సనప భరత్, కొంపెల్లి సంతోష్, గాడుదల దిలీప్, నగేష్, కోటి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.









