ఆధాబ్ న్యూస్/మణుగూరు :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి జీఎం ఆఫీస్‌లో సింగరేణి సిఎస్‌ఆర్ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులకు ఫర్నిచర్ అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మణుగూరులో సింగరేణి సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని, ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని వివరించారు. సింగరేణి కారణంగా మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, బిపిఎల్ వంటి అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏర్పడి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించాయని చెప్పారు.
సింగరేణి సిఎస్‌ఆర్ నిధులతో మూడో విడతలో నిరుద్యోగుల కోసమై గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, మణుగూరు గ్రౌండ్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు.
మణుగూరు ఓసి విస్తరణకు సంబంధించి గ్రామస్తులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజలు సింగరేణి సంస్థకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కంటి ఆపరేషన్లు నిర్వహించి, వృద్ధులకు కళ్లజోడు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు సింగరేణి జీఎం దుర్గం రామచందర్, ఎమ్మార్వో రాఘవ రెడ్డి, ఐఎన్టియుసీ నాయకులు కృష్ణంరాజు, జనరల్ సెక్రటరీ గట్టయ్య, కాంగ్రెస్ నాయకులు పిరినకి నవీన్, ఉపాధ్యాయులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.









