కేజీబీవీ హాస్టల్లో కోతుల బెడద
విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి
ఆధాబ్ న్యూస్ , కరకగూడెం, ఆగస్టు 23:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్లో కోతుల బెడదతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా హాస్టల్ పరిసరాల్లో కోతులు సంచరిస్తూ విద్యార్థులను భయపెట్టడంతో పాటు, హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను గీకుతున్న ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతులు హాస్టల్లోకి ప్రవేశిస్తుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. చిన్నారులు భయంతో గదుల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది తెలిపారు. కోతుల దాడులతో విద్యార్థులకు గాయాలయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ప్రత్యేక చొరవ తీసుకుని కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది కోరుతున్నారు. కోతులకు ఎలాంటి హాని కలగకుండా అటవీశాఖ నిబంధనల ప్రకారం వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలోకి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అలాగే భవిష్యత్తులో కోతులు హాస్టల్లోకి ప్రవేశించకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
“మా హాస్టల్‌కు వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించి, మా భద్రత కోసం కోతులను సురక్షితంగా అడవిలోకి తరలించే చర్యలు తీసుకోవాలి” అని విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్‌ను సందర్శించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.








