హైదరాబాద్‌లో GHMC ఎగ్జామినర్ ACB వలలో… ₹35,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: నగరంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి గట్టి దెబ్బ కొట్టింది. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను ₹35,000 లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే… ఒక ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైల్‌ను GHMC హెడ్ ఆఫీస్‌కు పంపించేందుకు ఎగ్జామినర్ మొదట ₹40,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఒప్పందం ప్రకారం ₹35,000 తీసుకుంటుండగా ACB అధికారులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు.
ఫిర్యాదు ఆధారంగా ముందుగా ట్రాప్ ఏర్పాటు చేసిన ACB అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ₹35,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ACB అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు ఇవ్వబోమని, లంచం అడిగిన అధికారులపై వెంటనే ACB కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.









