ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్?
నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. పంటల దిగుబడి తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితులు తలెత్తితే పేద కుటుంబాలపై భారం పడకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలైన ‘అమ్మహస్తం’ తరహా సబ్సిడీ రేషన్ పథకాన్ని తెలంగాణలో తిరిగి అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న డి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ‘అమ్మహస్తం’ పథకం ప్రారంభమైంది. రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు/అట్టా, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం, పసుపు, ఉప్పు తదితర నిత్యావసర వస్తువులను సబ్సిడీపై అందించారు.
ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా నిత్యావసర వస్తువులను అందించే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోధుమ పిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం తదితర వస్తువులను సబ్సిడీపై అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఎల్‌నినోపై ప్రత్యేక కార్యాచరణ
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కరువు పరిస్థితులు, నీటి లభ్యత, వ్యవసాయం తదితర అంశాలపై ముందస్తు చర్యలను పరిశీలిస్తోంది.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితులు ఏర్పడితే వ్యవసాయంతో పాటు తాగునీరు, నిత్యావసర సరుకుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో నీటి పొదుపు చర్యలను ముమ్మరం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
పేద కుటుంబాలపై నిత్యావసర సరుకుల ధరల భారం పడకుండా ‘అమ్మహస్తం’ తరహా పథకాన్ని పునరుద్ధరించే అంశంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
— ఆధాబ్ న్యూస్








