క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి
– విపిఎల్-6 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన సర్పంచ్ ఇర్ప శివప్రసాద్
ఆధాబ్ న్యూస్ ,తాడ్వాయి: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకుని క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని రంగాపూర్ సర్పంచ్ ఇర్ప శివప్రసాద్ అన్నారు. శుక్రవారం రంగాపూర్ స్కూల్ గ్రౌండ్లో ఏడు మండలాల స్థాయి విపిఎల్-6 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని, టోర్నమెంట్ ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ఐపీఎల్ తరహాలో గ్రామీణ ప్రాంతంలో ఆక్షన్ విధానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక తమ ప్రతిభను చాటుకోలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి టోర్నమెంట్ల ద్వారా యువ క్రీడాకారులకు మంచి వేదిక లభిస్తుందని, వారి ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
టోర్నమెంట్ నిర్వాహకులు గుడ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఏడు మండలాల నుంచి క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విపిఎల్-6 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు మంచి పోటీ వాతావరణం కల్పించడంతో పాటు ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు. టోర్నమెంట్ విజయవంతానికి క్రీడాకారులు, గ్రామస్తులు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో కొత్తగూడెం సర్పంచ్ ఎర్రం పోట్టయ్య, ఉపసర్పంచ్ ఇర్ప పుల్లయ్య, సెక్రటరీ రవికుమార్, మాజీ ఉపసర్పంచ్ జవ్వాజి మోహన్రావు, ఇర్ప సూర్యనారాయణ, గుమ్మడి ముత్తయ్య, టోర్నమెంట్ నిర్వాహకులు ఎట్టి ప్రసాద్, గ్రామస్తులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.








