తుఫాన్లతో రైతులకు తీరని నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలి!
పంట నష్టంపై గ్రామగ్రామాన సర్వే నిర్వహించి పరిహారం చెల్లించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
ఆధాబ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:
జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు అర్నబ్, మురాసు ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మిర్చి తదితర పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు తుఫాన్లతో పంటలు దెబ్బతింటుంటే, మరోవైపు సాగునీరు అందక, సరైన విద్యుత్ సరఫరా లేక పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన రైతులకు నేడు రైతుబంధు సకాలంలో అందక, సాగునీరు, విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి తీసుకురావడం దురదృష్టకరమన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య రైతుల సంక్షేమం విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించిన రేగా కాంతారావు, రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఎకరాకు తగిన పరిహారం చెల్లించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో ప్రతి గ్రామంలో పంట నష్టం సర్వే నిర్వహించాలని, వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
కేవలం తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులనే కాకుండా, సాగునీరు అందక, సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయిన రైతులను కూడా గుర్తించి ప్రత్యేక పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన విధానాలు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకోవాలని రేగా కాంతారావు కోరారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా స్పందించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.








