టీబీ నిర్మూలనకు ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలి
డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారం రాథోడ్
పినపాక, నవంబర్ 3 (ఆధాబ్ న్యూస్): టీబీ (క్షయ) వ్యాధి నిర్మూలనలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. మంగళవారం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో టీబీతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, సరైన చికిత్స, మందులు అందేలా చూడాలన్నారు. టీబీ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి కావడంతో ఆశా వర్కర్లు గ్రామాల్లో ప్రతి ఇంటినీ సందర్శించి, టీబీ అనుమానితులను గుర్తించాలని సూచించారు.
టీబీ అనుమానం ఉన్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కఫం (తెమడ) పరీక్షలు, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయితే తగిన మందులు అందించనున్నట్లు తెలిపారు. రోగులు మందులను క్రమం తప్పకుండా వినియోగించేలా ఆశా వర్కర్లు పర్యవేక్షించాలని సూచించారు.
అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగే సాధారణ ప్రసవాల సమయంలో అప్పుడే పుట్టిన శిశువులకు అందించాల్సిన వైద్య సేవలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరై ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటల ఆసుపత్రి కావడంతో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో సూచించారు.
ఈ సమావేశంలో డీపీఎంవో మోహన్, సీహెచ్‌వో సత్యావతి, ఆప్తాల్మిక్ ఆఫీసర్ జి. సంజీవరావు, పీహెచ్‌ఎన్ దేవమ్మ, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
— ఆధాబ్ న్యూస్








