ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మానవత్వానికి మారుపేరు.. ఆపదలో ఉన్న గర్భిణికి ఉచిత రక్తదానం! సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సేవలు

 

మానవత్వానికి మారుపేరు.. ఆపదలో ఉన్న గర్భిణికి ఉచిత రక్తదానం!

సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సేవలు

రక్తదాతలు ముందుకు రావాలని అధ్యక్షుడు మెంతిని సాగర్ పిలుపు

ఆధాబ్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం :

ఆపదలో ఉన్నవారికి రక్తం అందించి ప్రాణాలు నిలబెట్టడమే లక్ష్యంగా సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వ్యవస్థాపకులు, అధ్యక్షులు మెంతిని సాగర్ ఉచిత రక్తదాన సేవలు అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన ఇంటెనికి అనిత, భర్త శ్రీకాంత్ అనే గర్భిణీకి అనారోగ్యంగా అనిపించడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో రక్తం తక్కువగా ఉందని, వెంటనే రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రక్తం కోసం ప్రయత్నిస్తుండగా, గ్రామస్తుల సూచన మేరకు సాగర్ బ్లడ్ బ్యాంక్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు మెంతిని సాగర్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన సాగర్, కొత్తగూడెం పట్టణానికి చెందిన రక్తదాత అజ్మీరా మనోహర్ నాయక్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే తన విధులను పక్కనపెట్టి ఆసుపత్రికి చేరుకున్న మనోహర్ నాయక్ గర్భిణీకి రక్తదానం చేశారు. ఇప్పటివరకు ఆయన ఎనిమిది సార్లు రక్తదానం చేయడం విశేషం. సమయానికి రక్తం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆపద సమయంలో స్పందించి ఉచితంగా రక్తం అందించిన అజ్మీరా మనోహర్ నాయక్‌కు, రక్తదానం అందేలా సహకరించిన మెంతిని సాగర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాగర్ బ్లడ్ బ్యాంక్ అందిస్తున్న సేవలను ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రక్తదాత అజ్మీరా మనోహర్ నాయక్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడానికి డబ్బు అవసరం లేదని, ఒకరి ప్రాణాన్ని కాపాడాలనే మంచి మనసు ఉంటే సరిపోతుందని అన్నారు. ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కనీసం ఒకరైనా రక్తదాతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఆపదలో ఉన్నవారికి రక్తం అందించడం కేవలం దానం కాదు.. ఒక ప్రాణానికి పునర్జన్మ ఇవ్వడమే. రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు