తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి
విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్
రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : కన్నవారిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు.. వారి జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో చిరస్థాయిగా నిలపాలనే సంకల్పంతో ‘అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్’ ముందుకు సాగుతోంది. తల్లిదండ్రుల వర్ధంతిని పురస్కరించుకుని కరకగూడెం మండలం శ్రీరంగపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయి.
ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు జాడి మాధవరావు, జాడి ముసలయ్యల తల్లిదండ్రులు స్వర్గీయ జాడి లక్ష్మి, జాడి చొక్కయ్యల స్మృతిలో స్వగృహం వద్ద వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలిచేలా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రతిభకు నగదు ప్రోత్సాహం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందించారు. కేజీబీవీ కరకగూడెం, భట్టుపల్లి, అనంతారం జెడ్పీహెచ్‌ఎస్, చిరుమళ్ల ఆశ్రమ పాఠశాలలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేశారు.
విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేసి.. చదువులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
తాగునీటి కోసం చేయూత
పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను గుర్తించిన ట్రస్ట్.. కరకగూడెం, అనంతారం పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చెరో రూ.15 వేల ఆర్థిక సహాయం ప్రకటించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
గురువులకు గౌరవం
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడారు.
సాయిని ప్రసాద్ నేత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్, భరత్ వాగ్మారే ముఖ్య అతిథులుగా హాజరై ట్రస్ట్ సేవలను అభినందించారు.
తల్లిదండ్రుల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాలతో ముడిపెట్టి.. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ‘అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్’ కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయి.








