కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి
పెండింగ్‌లో ఉన్న చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం
ఆశ్వాపురం, ఆధాబ్ న్యూస్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గద్దల రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆశ్వాపురం మండల తహసీల్దార్‌కు పెండింగ్‌లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గద్దల రామకృష్ణ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే లబ్ధిదారులకు అందజేయడంతో పాటు పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలను నిలిపివేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం యూత్ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్, ఆశ్వాపురం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చల్లా రాజేష్, ఆశ్వాపురం యూత్ వైస్ ప్రెసిడెంట్ రాసాల రమేష్, గొల్లగూడెం సర్పంచ్ కొండ్రు సమ్మయ్య, బీసీ సెల్ అధ్యక్షులు అరసవెల్లి పవన్, యువజన నాయకులు మంగళగిరి రామకృష్ణ, జావిద్ తదితరులు పాల్గొన్నారు.








