అర్థరాత్రి మారెళ్లపాడు పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయం
త్వరితగతిన రైతులకు నీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పాయం
ఆధాబ్ న్యూస్ అశ్వాపురం, ఆగస్టు 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడులో జరుగుతున్న పనుల పురోగతిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తుమ్మలచెరువుకు గోదావరి నీటిని వీలైనంత త్వరగా తరలించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి, పగలు రెండు షిఫ్టుల్లో పనులు కొనసాగించాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా పనులను ఆపవద్దని, నాలుగైదు రోజుల్లో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని, అవసరమైతే పనులు పూర్తయ్యే వరకు పగలు, రాత్రి ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.
నెలాఖరులోగా మారెళ్లపాడు ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసి తీరుతామని, రైతులకు త్వరితగతిన సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సీనియర్ నాయకులు వూసా అనిల్ కుమార్, SRLP డీఈ శ్రీనివాస్, ఇతర అధికారులు, కోలా శశికాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.








