శివలింగాపురంలో కార్డాన్ అండ్ సెర్చ్..
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన
మణుగూరు, ఆగస్టు 11 (ఆధాబ్ న్యూస్):
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు మణుగూరు పట్టణంలోని శివలింగాపురంలో మణుగూరు సబ్ డివిజన్ పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు.
అనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డి స్థానిక ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, OTPలు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
అలాగే యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.
ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణకు, నేరస్తులను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రజలకు వివరించారు.
ఈ కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో మణుగూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









