ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఆదివాసుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు సాగాలి: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం, ఆగస్టు 09 (ఆధాబ్ న్యూస్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండల కేంద్రంలో మండల JAC కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఆదివాసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ZP చైర్మన్ డా. చందా లింగయ్య దొర హాజరయ్యారు. మండల కేంద్రంలోని బ్యాంకు వద్ద నుంచి ఆదివాసులు, JAC నాయకులు, సర్పంచులు, ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి డోలు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీగా బట్టుపల్లి (విరాపురం) ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఆదివాసీ ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ విగ్రహం వద్దకు చేరుకుని ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను కాపాడుకుంటూ సమాజ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని అన్నారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జై ఆదివాసి, జై కొమరం భీమ్ నినాదాలతో కరకగూడెం మండల కేంద్రం మార్మోగింది.









