హెచ్చరికలు బేఖాతర్.. మళ్లీ కరకగూడెం రోడ్డుపై ఇసుక లారీలు
పోలీసులు అడ్డుకున్నా మారని పరిస్థితి.. రూట్ మార్చకుండా యథేచ్ఛగా రాకపోకలు
కరకగూడెం, ఆగస్టు 09 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలం మీదుగా ఇసుక లారీల రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా ఇసుక లారీ డ్రైవర్లు మళ్లీ కరకగూడెం రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు.
ఇసుకను తరలిస్తున్న భారీ లారీలు నిర్ణయించిన మార్గంలో కాకుండా తాడ్వాయి–వై జంక్షన్ మీదుగా కరకగూడెం వైపు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల పోలీసులు లారీలను నిలిపి డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేసినా.. అదే రూట్‌లో లారీల రాకపోకలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంతెనలపై పెరుగుతున్న భారం
అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల కారణంగా గ్రామీణ రహదారులతో పాటు వంతెనల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వాహనాల నిరంతర రాకపోకలతో వంతెనలపై అధిక భారం పడటంతో భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
దుమ్ము.. ట్రాఫిక్.. ప్రమాద భయం
ఇసుక లారీల రాకపోకలతో రహదారులపై దుమ్ము కాలుష్యం పెరగడంతో పాటు గ్రామాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు. వేగంగా, అధిక లోడుతో ప్రయాణించే లారీల వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇక చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాటిని ఉల్లంఘిస్తూ కరకగూడెం రూట్‌లో తిరుగుతున్న ఇసుక లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే లారీలపై కేసులు నమోదు చేసి, అధిక లోడుపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.









