కరకగూడెం మీదుగా ఇసుక లారీల రాకపోకలకు అడ్డుకట్ట
బ్రిడ్జిలపై అధిక భారంతో ప్రమాదం.. డ్రైవర్లకు ఎస్సై హెచ్చరికలు
కరకగూడెం, ఆగస్టు 08 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో అధిక సంఖ్యలో సంచరిస్తున్న ఇసుక లారీల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోలీసులు స్పందించారు. కరకగూడెం ఎస్సై పీవీ నాగేశ్వరరావు శనివారం ఇసుక లారీలను అడ్డుకుని డ్రైవర్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.
వరంగల్ నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలు ములుగు, ఏటూరునాగారం, జానంపేట, పినపాక మార్గంలో ప్రయాణించాల్సి ఉండగా, కొంతమంది డ్రైవర్లు తాడ్వాయి–వై జంక్షన్ మీదుగా కరకగూడెం రహదారిని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు, దుమ్ము కాలుష్యంతో పాటు రహదారి భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా అధిక లోడుతో ఇసుక లారీలు గ్రామీణ రహదారులపై ఉన్న వంతెనలపై ప్రయాణించడం వల్ల వాటిపై అదనపు భారం పడటంతో వంతెనలు దెబ్బతిని, భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సై పీవీ నాగేశ్వరరావు కరకగూడెం మీదుగా వెళ్తున్న ఇసుక లారీలను నిలిపివేసి, నిర్ణయించిన మార్గాల్లోనే ప్రయాణించాలని డ్రైవర్లకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కరకగూడెం రూట్‌ను వినియోగించవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.









