వేటగాళ్ల ఉచ్చుకు బలైన ఆవు…
కరకగూడెం, ఆగస్టు 7 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చుకు చిక్కి ఓ ఆవు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
స్థానిక రైతు పోలేబోయిన వెంకయ్యకు చెందిన ఆవు ప్రతిరోజులాగే గడ్డి మేత కోసం అడవికి వెళ్లగా, వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుంది. ఉచ్చు నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
సమాచారం అందుకున్న యజమాని ఘటనాస్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని తెలిపారు.
అటవీ ప్రాంతాల్లో అక్రమంగా ఉచ్చులు ఏర్పాటు చేయడం వల్ల వన్యప్రాణులతో పాటు పశువులు కూడా బలవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించి ఉచ్చులు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ పరిసర అటవీ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.









