31 ఏళ్లుగా గోమాత సేవలో అన్నపూర్ణ గోసంరక్షణ సమితి.. గోశాలల అభివృద్ధికి ప్రభుత్వాలు, దాతలు చేయూతనివ్వాలి: ప్రధాన కార్యదర్శి ఆంజనేయ శర్మ
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, ఆధాబ్ న్యూస్:
గోమాత సేవను జీవిత ధ్యేయంగా భావించి గత 31 సంవత్సరాలుగా నిరంతరంగా గోసంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నపూర్ణ గోసంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆంజనేయ శర్మ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం బావోజీ తండాలో నిర్వహిస్తున్న గోశాలలో నిరాశ్రయంగా తిరిగే ఆవులు, ప్రమాదాల్లో గాయపడిన పశువులు, అనారోగ్యానికి గురైన గోవులను ఆశ్రయించి వాటికి ఆహారం, తాగునీరు, సంరక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. గోమాత సేవ కేవలం ఒక సేవా కార్యక్రమం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో భాగమని పేర్కొన్నారు.
గోశాల నిర్వహణ రోజురోజుకు భారంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోశాలకు కేవలం 12 ఎకరాల భూమి మాత్రమే ఉండగా, గోమాతలకు అవసరమైన పచ్చిగడ్డి సాగు చేసేందుకు, మేత అవసరాలు తీర్చేందుకు కనీసం 20 నుంచి 30 ఎకరాల అదనపు భూమి అవసరమని తెలిపారు. ఆ భూమికి విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పిస్తే గోశాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
గోశాలలో మరణించిన పశువులను పూడ్చిపెట్టేందుకు ప్రత్యేక స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే గోశాలలో ఉన్న పశువులకు శాశ్వత పశువైద్య సేవలు అందించే వ్యవస్థ లేదని, ఒక గోపాలమిత్రను నియమించి పశువైద్య సేవలు అందిస్తేనే ప్రతిరోజూ వాటి ఆరోగ్యాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గోశాలలో వందలాది పశువులను చూసుకునేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారిందన్నారు.
గోశాల ఏర్పాటైన సమయంలో చుట్టుపక్కల ప్రాంతమంతా బీడు భూమిగా ఉండేదని, ఆవులు స్వేచ్ఛగా వెళ్లి మేత మేసేవని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పోడు భూములుగా మారిపోవడంతో గోశాలలోని పశువులకు బయట మేత మేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల అటవీ భూములు లేదా బంజరు భూముల్లో కొంత ప్రాంతాన్ని గోమాతల మేత కోసం ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
గోశాలలోని మౌలిక సదుపాయాలు కూడా అత్యంత దయనీయంగా మారాయని ఆంజనేయ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 సంవత్సరాల క్రితం నిర్మించిన పశువుల షెడ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతాయోనన్న పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. వర్షాకాలంలో షెడ్లలో పశువులను ఉంచడం కూడా ప్రమాదకరంగా మారిందన్నారు. అలాగే ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన గాలిదుమారానికి గోశాలలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్మించిన ఆడిటోరియం పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. అదేవిధంగా గోశాల ఆవరణలో నిర్మించ తలపెట్టిన శ్రీరామాలయం, శ్రీకృష్ణ ఆలయాల నిర్మాణ పనులు స్లాబ్ దశ వరకు పూర్తయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు, భక్తులు సహకరిస్తే ఆలయ నిర్మాణాలను పూర్తి చేసి గోశాలను ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఎటువంటి అదనపు నిధులు, సిబ్బంది, వసతులు కల్పించకుండా రోడ్లపై సంచరించే నిరాశ్రయ పశువులను పోలీసులు గోశాలకు తరలిస్తున్నారని, దీంతో గోశాలపై భారం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. పశుగ్రాసం, వైద్య ఖర్చులు, కార్మికుల వేతనాలు, విద్యుత్, నీటి సౌకర్యాల నిర్వహణతో గోశాలను కొనసాగించడం మానసికంగా, ఆర్థికంగా ఎంతో భారంగా మారిందని చెప్పారు.
గోశాలలో ఉన్న అన్ని పశువులను దీర్ఘకాలం పోషించడం కష్టంగా మారిన పరిస్థితుల్లో కొంతమంది రైతులకు ఆవులు, ఎద్దులను ఉచితంగా అప్పగిస్తున్నామని తెలిపారు. అయితే వాటిని సంరక్షించాల్సిన రైతుల్లో దాదాపు 90 శాతం మంది కొంతకాలానికే వాటిని విక్రయిస్తుండడం అత్యంత బాధాకరమని అన్నారు. గోమాతల సంరక్షణ కోసం ఇచ్చిన పశువులు వ్యాపార వస్తువులుగా మారడం సమాజానికి శోచనీయమని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించి అదనపు భూములు, పచ్చిగడ్డి సాగుకు అవసరమైన వనరులు, విద్యుత్, నీటి సౌకర్యాలు, గోపాలమిత్రల నియామకం, శాశ్వత పశువైద్య సేవలు, కొత్త షెడ్ల నిర్మాణం, శిథిలమైన భవనాల పునర్నిర్మాణం, ఆడిటోరియం మరమ్మతులు, నిలిచిపోయిన ఆలయాల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఆంజనేయ శర్మ విజ్ఞప్తి చేశారు.
సమాజంలోని దాతలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం కలిగిన యువత గోశాలలకు ఆర్థికంగా, వస్తు రూపంలో చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. గోమాతలను రక్షించడం ప్రతి భారతీయుడి సామాజిక, నైతిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రభుత్వం–ప్రజలు–దాతలు కలిసి ముందుకు వస్తేనే గోసంరక్షణ మరింత బలోపేతం అవుతుందని, భావితరాలకు భారతీయ సంస్కృతి, గోమాతల ప్రాధాన్యతను పరిరక్షించగలమని అన్నపూర్ణ గోసంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆంజనేయ శర్మ అన్నారు.









