31 ఏళ్లుగా గోమాత సేవలో అన్నపూర్ణ గోసంరక్షణ సమితి.. 31 ఏళ్లుగా గోమాత సేవలో అన్నపూర్ణ గోసంరక్షణ సమితి.. గోశాలల అభివృద్ధికి ప్రభుత్వాలు, దాతలు చేయూతనివ్వాలి: ప్రధాన కార్యదర్శి ఆంజనేయ శర్మ
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బావోజీ తండాలోని అన్నపూర్ణ గోసంరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 31 సంవత్సరాలుగా నిరంతరంగా గోమాతల సంరక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సమితి ప్రధాన కార్యదర్శి ఆంజనేయ శర్మ తెలిపారు. నిరాశ్రయంగా తిరిగే ఆవులు, ప్రమాదాల్లో గాయపడిన పశువులు, అనారోగ్యానికి గురైన గోవులకు ఆశ్రయం కల్పించి ఆహారం, తాగునీరు, సంరక్షణ అందిస్తున్నామని చెప్పారు. గోమాత సేవ కేవలం ఒక సేవా కార్యక్రమం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో భాగమని పేర్కొన్నారు.
ప్రస్తుతం గోశాల నిర్వహణ అత్యంత క్లిష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలకు ప్రస్తుతం 12 ఎకరాల భూమి మాత్రమే ఉండగా, పచ్చిగడ్డి సాగు చేసి పశువుల మేత అవసరాలు తీర్చేందుకు కనీసం 20 నుంచి 30 ఎకరాల అదనపు భూమి అవసరమని తెలిపారు. ఆ భూమికి విద్యుత్, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తే గోశాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
గోశాలలో చనిపోయిన పశువులను పూడ్చిపెట్టేందుకు ప్రత్యేక స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే గోశాలలో ఉన్న పశువులకు శాశ్వత పశువైద్య సేవలు లేకపోవడం, ఒక గోపాలమిత్ర కూడా అందుబాటులో లేకపోవడంతో వాటి ఆరోగ్య సంరక్షణ కష్టంగా మారిందన్నారు. ప్రతిరోజూ వందలాది పశువులను చూసుకునేందుకు అవసరమైన సిబ్బంది కూడా లేకపోవడం మరో ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.
గోశాల ప్రారంభించిన సమయంలో చుట్టుపక్కల ప్రాంతమంతా బీడు భూమిగా ఉండేదని, ఆవులు స్వేచ్ఛగా మేత మేసేవని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నీ పోడు భూములుగా మారిపోవడంతో పశువులకు బయట మేత మేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. అటవీ భూములు లేదా బంజరు భూముల్లో కొంత ప్రాంతాన్ని గోమాతల మేత కోసం ప్రభుత్వం కేటాయించాలని కోరారు.
గోశాలలో మౌలిక సదుపాయాల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని ఆంజనేయ శర్మ తెలిపారు. 15 సంవత్సరాల క్రితం నిర్మించిన పశువుల షెడ్లు శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతాయోనన్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో వాటిలో పశువులను ఉంచడం ప్రమాదకరంగా మారిందన్నారు. అలాగే ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన గాలిదుమారానికి సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్మించిన ఆడిటోరియం పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. అదేవిధంగా గోశాల ఆవరణలో నిర్మించ తలపెట్టిన శ్రీరామాలయం, శ్రీకృష్ణ ఆలయాల నిర్మాణ పనులు స్లాబ్ దశ వరకు పూర్తయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఎలాంటి అదనపు నిధులు, సిబ్బంది, వసతులు కల్పించకుండా రోడ్లపై సంచరించే నిరాశ్రయ పశువులను పోలీసులు గోశాలకు తరలిస్తున్నారని, దీంతో గోశాలపై భారం మరింత పెరుగుతోందన్నారు. పశుగ్రాసం, వైద్య ఖర్చులు, కార్మికుల వేతనాలు, విద్యుత్, నీటి సౌకర్యాల నిర్వహణతో గోశాలను కొనసాగించడం మానసికంగా, ఆర్థికంగా భారంగా మారిందని చెప్పారు.
గోశాలలో ఉన్న అన్ని పశువులను దీర్ఘకాలం పోషించడం కష్టంగా మారడంతో కొంతమంది రైతులకు ఆవులు, ఎద్దులను ఉచితంగా అప్పగిస్తున్నామని తెలిపారు. అయితే వాటిని తీసుకెళ్లిన వారిలో దాదాపు 90 శాతం మంది కొంతకాలానికే వాటిని విక్రయిస్తుండడం అత్యంత బాధాకరమని అన్నారు. గోమాతల సంరక్షణ కోసం ఇచ్చిన పశువులు వ్యాపార వస్తువులుగా మారడం సమాజానికి శోచనీయమని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించి అదనపు భూములు, పచ్చిగడ్డి సాగుకు అవసరమైన వనరులు, విద్యుత్, నీటి సౌకర్యాలు, గోపాలమిత్రల నియామకం, శాశ్వత పశువైద్య సేవలు, కొత్త షెడ్ల నిర్మాణం, శిథిలమైన భవనాల పునర్నిర్మాణం, ఆడిటోరియం మరమ్మతులు, నిలిచిపోయిన ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆంజనేయ శర్మ ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే సమాజంలోని దాతలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం కలిగిన యువత గోశాలల అభివృద్ధికి ఆర్థికంగా, వస్తు రూపంలో చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, దాతలు, ప్రజలు కలిసి ముందుకు వస్తేనే గోసంరక్షణ బలోపేతమై, గోమాతల రక్షణతో పాటు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలను భావితరాలకు అందించగలమని అన్నపూర్ణ గోసంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆంజనేయ శర్మ అన్నారు.









