కరకగూడెం పోలీసుల తనిఖీల్లో అక్రమ పశువుల రవాణా బట్టబయలు
ఎస్ఐ పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో తనిఖీలు.. 11 పశువుల స్వాధీనం, నలుగురిపై కేసు
కరకగూడెం, ఆగస్టు 1 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం ఎస్ఐ పి.వి.ఎన్. రావు ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన రెండు దోస్త్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా, వాటిలో 11 పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు.
పశువుల రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించాలని పోలీసులు కోరగా, వాటిని తరలిస్తున్న వ్యక్తులు సరైన పత్రాలు సమర్పించలేకపోయారు. దీంతో వాహనాల్లో ఉన్న 11 పశువులను పాల్వంచ గో సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.
ఈ ఘటనకు సంబంధించి బానోతు మొగిలి, బానోతు శ్రీకాంత్, అంగోతు విజేందర్, కాసుమంచి శ్రీకాంత్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, బుధరావుపేట పంచాయతీ పరిధిలోని వదినేపల్లి గ్రామానికి చెందిన వారని పేర్కొన్నారు.
అక్రమంగా పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కరకగూడెం ఎస్ఐ పి.వి.ఎన్. రావు ఒక ప్రకటనలో తెలిపారు.









