గోదావరి వరదలపై పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తం
లోతట్టు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశం
భద్రాచలం, జూలై 31 (ఆధాబ్ న్యూస్): గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా విస్తా కాంప్లెక్స్ స్లూయిస్, గోదావరి కరకట్ట, స్నాన ఘాట్లు, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన అధికారులు ప్రజల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
గోదావరిలో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. గోదావరి స్నాన ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, పర్యాటక ప్రాంతాల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను గోదావరిలోకి అనుమతించవద్దని, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ వరద ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.









