సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్వో డాక్టర్ తుకారం రాథోడ్
ఆధాబ్ న్యూస్ కొత్తగూడెం 29 జూలై 2026
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వ–ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణపై జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ తుకారం రాథోడ్ బుధవారం వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (CHCలు), ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్లలో తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సిన్ (Anti Rabies Vaccine) అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే కుక్కకాటు కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్ అధికారిని నియమించి, ఆ వివరాలను ప్రజలకు కనిపించేలా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు.
వైద్యాధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లను ప్రతి రెండు వారాలకు ఒకసారి తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్టల్ సిబ్బందికి పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు వంట చేసే వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జ్వరం, విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి వెంటనే సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు.
ప్రతి మంగళవారం, శుక్రవారం యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్వహించే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి వారాంత నివేదికలను సమర్పించాలని, వాటి ఆధారంగా వ్యాధులు అధికంగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వ్యాధి నిరోధక టీకాలు, ఎన్సీడీ స్క్రీనింగ్, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA), ఆరోగ్య మహిళ, సికిల్ సెల్ స్క్రీనింగ్, టీబీ అనుమానితుల గుర్తింపు, రోగులకు మందుల పంపిణీ, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందిస్తూ నిరంతర సమీక్షలు నిర్వహించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.









