ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో బీభత్సం.. సుడిగాలులకు కూలిన భారీ వృక్షాలు
మంగపేట–కోమటిపల్లి అటవీ ప్రాంతంలో వందకు పైగా చెట్లు దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా
ములుగు, ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కోమటిపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు తోడు వీచిన టోర్నడో తరహా సుడిగాలుల కారణంగా అటవీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడి పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సుడిగాలుల ధాటికి దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున వృక్షాలు నేలకూలినట్లు సమాచారం. ప్రస్తుతం పూర్తిస్థాయి నష్టం వివరాలను అంచనా వేయడం సాధ్యం కాదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ప్రాథమిక అంచనా ప్రకారం వందకు పైగా భారీ వృక్షాలు దెబ్బతిన్న ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. వర్షాలు తగ్గిన అనంతరం అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నష్టం వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.
అటవీ శాఖ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రహదారిపై పడిన వృక్షాలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.









