పెద్ది సుదర్శన్ రెడ్డికి 72 గంటల న్యూరోలాజికల్ రీ-అసెస్మెంట్ అనంతరమే కోలుకునే అవకాశాలపై స్పష్టత: యశోద ఆసుపత్రి
హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం – శ్వాసక్రియ స్థిరంగా ఉన్నా మెదడు స్పందనపై ఆందోళన
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి యాజమాన్యం మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
బులెటిన్ ప్రకారం, ఊపిరితిత్తుల్లో భారీ రక్తగడ్డలు (మాసివ్ పల్మనరీ ఎంబోలిజం) ఏర్పడి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు వరంగల్‌లో అత్యవసర చికిత్స అందించిన అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుండగా, శ్వాసక్రియ (రెస్పిరేటరీ ఫంక్షనింగ్), రక్తపోటు వంటి కీలక శారీరక విధులు వైద్యుల పర్యవేక్షణలో స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే గుండె ఆగిన సమయంలో కొంతసేపు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు దెబ్బతిన్నట్లు (అనాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ) పరీక్షల్లో సంకేతాలు కనిపించాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మత్తు మందులు లేకపోయినా మాటలకు, నొప్పికి ఆయన స్పందించడం లేదని తెలిపారు.
EEG, MRI, CT స్కాన్ తదితర పరీక్షల ఆధారంగా అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల న్యూరోలాజికల్ రీ-అసెస్మెంట్ నిర్వహించిన తర్వాతే ఆయన కోలుకునే అవకాశాలపై స్పష్టమైన అంచనా వేయగలమని వైద్యులు వెల్లడించారు.
కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు యశోద ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.









