భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
భద్రాచలం, జూలై 25 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలోని కూనవరం రోడ్డుపై నిర్వహించిన తనిఖీల్లో 101 కిలోల డ్రై గంజాయిని పట్టుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు డ్రై గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ KA-03-NR-5892 గల మారుతి ఎర్టిగా కారును తనిఖీ చేయగా, అందులో 101 కిలోల డ్రై గంజాయి లభ్యమైంది.
ఈ సందర్భంగా గంజాయి రవాణాకు ఉపయోగించిన మారుతి ఎర్టిగా కారుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
ప్రాథమిక విచారణలో నిందితులు మోతుగూడెం నుంచి గంజాయిని భద్రాచలం–ఖమ్మం మార్గం మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ దాడిలో సీఐ రహీమున్నీసా, ఎస్ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీమ్తో పాటు పోలీసు సిబ్బంది భద్రం, సీతారాం, రాకేష్, రవి పాల్గొన్నారు.









