విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నీట్ పేపర్ లీక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి: గుడ్ల రంజిత్ కుమార్
కరకగూడెం, జూలై 24 (ఆధాబ్ న్యూస్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని కరకగూడెం మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుడ్ల రంజిత్ కుమార్ ఆరోపించారు.
శుక్రవారం నిరుద్యోగ జేఏసీ (JAC), విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, పోలీసు నియామక పోస్టులను 19 వేల వరకు పెంచాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, అందుకే నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గోడ అఖిల్, రవి తదితరులు పాల్గొన్నారు.









