అశ్వాపురం చింతరాల క్రాస్‌రోడ్‌లో నాకాబంది
100 వాహనాల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు
అశ్వాపురం, జూలై 23 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గురువారం అశ్వాపురం మండలంలోని చింతరాల క్రాస్‌రోడ్ వద్ద మణుగూరు డీఎస్పీ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 100 వాహనాలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించారు. అలాగే నంబర్ ప్లేట్లు లేని 13 మోటార్ సైకిళ్లను గుర్తించి వాటిని అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, రిజిస్ట్రేషన్ తదితర పత్రాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.
ఈ నాకాబంది కార్యక్రమంలో అశ్వాపురం సీఐ చిలువేరు ఎల్లయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









