కరకగూడెంలో వానాకాలం నాట్లు నిదానంగా
కరకగూడెం, జూలై 21 (ఆధాబ్ న్యూస్)
: కరకగూడెం మండలంలో వానాకాలం సాగు పనులు ఈ ఏడాది నిదానంగా కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి మండలవ్యాప్తంగా సుమారు 10,321 ఎకరాల్లో సాగు జరగగా, ప్రస్తుతం కేవలం 1,250 ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తైనట్లు సమాచారం.
వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా వానాకాలం ప్రారంభంలో వేగంగా సాగాల్సిన నాట్ల ప్రక్రియ, ఈసారి నీటి లభ్యత తగ్గడంతో ఆలస్యమవుతోందని రైతులు చెబుతున్నారు.
పొలాల్లో నీరు నిల్వ ఉండకపోవడం, చెరువులు మరియు ఇతర నీటి వనరుల్లో సరిపడా నీరు లేకపోవడం వల్ల అనేక మంది రైతులు నాట్లను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు కూడా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే సాగు పనులు ఊపందుకుంటాయని, రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తగ్గుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వర్షాల పరిస్థితిని బట్టి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని, వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.









