ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత.. నిర్మాణాలు నిలిచిపోతున్నాయి
పెద్దవాగు నుంచి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలి: తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు పోలేబోయిన ప్రేమ్ కుమార్
కరకగూడెం, జూలై 20 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇసుక కొరతతో నిలిచిపోయే పరిస్థితి నెలకొందని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు పోలేబోయిన ప్రేమ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మండలానికి సమీపంలో పెద్దవాగు ఉన్నప్పటికీ గత రెండు నెలలుగా అక్కడి నుంచి ఇసుక తరలింపును నిలిపివేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నిర్మాణాలకు అత్యవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. దీంతో లబ్ధిదారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని, పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
మండలంలోని ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించకపోవడం వల్లే ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని ఆయన విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా పెద్దవాగు నుంచి ఇసుక రవాణాకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని, లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాన్ని పోలేబోయిన ప్రేమ్ కుమార్ కోరారు.
ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు.









