రెండేళ్లుగా ఫిజిక్స్ టీచర్ లేరు.. 50 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో
అనంతారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఆవేదన.. వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని విజ్ఞప్తి
కరకగూడెం, జూలై 20 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత రెండేళ్లుగా ఫిజిక్స్ సబ్జెక్టుకు శాశ్వత ఉపాధ్యాయుడు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిజిక్స్ సబ్జెక్టుకు కేటాయించబడిన ఉపాధ్యాయురాలు రెండేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై పాల్వంచలోని జడ్పీహెచ్ఎస్ కేటీపీఎస్ పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి అనంతారం పాఠశాలలో ఆ పోస్టు ఖాళీగానే ఉందని విద్యార్థులు తెలిపారు.
దీంతో ఫిజిక్స్ సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయుడు లేక సుమారు 50 మంది విద్యార్థులు విద్యాభ్యాసంలో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతిలో ఫిజిక్స్ అత్యంత కీలకమైన సబ్జెక్టు అయినప్పటికీ, గత రెండేళ్లుగా ఎవరూ సక్రమంగా బోధించకపోవడంతో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలమా అనే ఆందోళన నెలకొందని విద్యార్థులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే అనంతారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ఫిజిక్స్ ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని, జిల్లా విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
అధికారులు స్పందించి వెంటనే ఉపాధ్యాయుడిని నియమించి తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.









