ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19 (ఆధాబ్ న్యూస్): ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
సోమవారం (జూలై 20) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు.
ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు వెంటనే స్వీకరించి, వాటిపై త్వరితగతిన విచారణ చేపట్టి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అదేవిధంగా జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.









