విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కరకగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గుడ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరకగూడెం మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జిల్లా నాయకులతో కలిసి గుడ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సమర్థవంతమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు), ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాల పంపిణీని వెంటనే పూర్తి చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం కరకగూడెం మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు బోడ రవి, తాళ్లపల్లి రామకృష్ణ, విద్యార్థి సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









