పినపాక,కరకగూడెం మండలంలో క్రాకర్స్ షాపులకు అనుమతి తప్పనిసరి
ఫైర్ ఆఫీసర్ పి. వినోద్ కుమార్ హెచ్చరిక
కరకగూడె,ఆధాబ్ న్యూస్: దీపావళి పర్వదినం సందర్భంగా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న క్రాకర్స్ షాపులపై అగ్నిమాపక శాఖ అధికారులు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రతి వ్యాపారి తప్పనిసరిగా ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకుని మాత్రమే షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసే సమయంలో కింది నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు.
షాపులు ఓపెన్ ఏరియాలో, అనుమతి పొందిన ప్రదేశంలోనే ఏర్పాటు చేయాలి.
షాప్ నిర్మాణం క్లాత్, వుడ్, టార్పాలిన్ వంటి కాలే వస్తువులతో చేయరాదు.
వైరింగ్ పనులు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయించాలి.
ప్రతి షాప్‌లో కనీసం రెండు డీసిపి ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలి. అందులో ఒకటి 5 కిలోల సామర్థ్యం కలిగి ఉండాలి.
రెండు వాటర్ బ్యారెల్స్ ఏర్పాటు చేయాలి, అందులో ఒకటి కనీసం 200 లీటర్ల నీటితో నింపాలి.
షాపు పరిసరాల్లో పొగతాగడం నిషేధమని స్పష్టమైన బోర్డులు ఉండాలి.
18 ఏళ్ల లోపు వయస్సు గల వారిని పనిలో నియమించరాదు.
షాప్ చుట్టూ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచాలి.
ప్రతి షాప్ మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.
ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పి. వినోద్ కుమార్ హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతను కాపాడేందుకు వ్యాపారులు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









