ఆత్యాశకు పోయి ఆన్లైన్ బెట్టింగుల ఊబిలో చిక్కుకోకండి: ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ, గేమ్స్, పేకాట, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లవైపు ఆకర్షితమవుతూ తమ సంపాదన మొత్తం కోల్పోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ట్రెండ్ ఆందోళనకరంగా మారిందని తెలిపారు.
ప్రారంభంలో కొద్దిపాటి లాభాలు రావడం వల్ల ఇది ఆదాయ మార్గమని భావించి, మరింత డబ్బు సంపాదించాలనే ఆశతో ఎంతోమంది ఈ గేములకు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువతతో పాటు, రిటైర్ అయిన ఉద్యోగులు, పెద్దవాళ్లు కూడా ఈ బెట్టింగ్ ఆటల బారినపడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, “ఆన్లైన్ గేమ్స్ అన్నీ ముందుగానే ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి. దాంతో ఎప్పటికైనా ఓ దశలో మన డబ్బు పోగొట్టుకోవడం ఖాయం. దీన్ని గ్రహించక అనేక మంది మోసపోతున్నారు. అప్పుల భారంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు,” అని వివరించారు.
లోన్ యాప్ల వలలో పడొద్దు:
అలాగే, సులభ లోన్ల పేరుతో నిమిషాల్లో డబ్బు అందిస్తామంటూ ప్రచారం చేస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. “ఇలాంటి యాప్స్ నుండి తీసుకున్న లోన్లు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్, జూదాల్లో పెట్టి నష్టపోతున్నారు. తరువాత ఈ కంపెనీలు వారి వ్యక్తిగత వివరాలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడతాయి. దీనివల్ల బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు,” అని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను నిత్యం గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా లాభాలొస్తాయని భావించడం తప్పుడు అంచనిని అని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఇలాంటి యాప్స్ వాడితే శిక్ష తప్పదని, బాధితులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
తగిన సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వండి:
బెట్టింగ్ లేదా జూదం కార్యకలాపాలు గానీ, అనుమానాస్పద ఆన్లైన్ యాప్లు గానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ప్రజల జీవితాలను రక్షించడానికి అందరూ చొరవ చూపాలని ఆయన సూచించారు.









