రేగుళ్ల–గొడుగుబండ రహదారికి మోక్షమెప్పుడో?
ఐదేళ్లుగా గుంతలమయమైన రహదారి.. పట్టించుకోని అధికారులు!
ఆధాబ్ న్యూస్ , కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని తుమ్మలగూడెం గ్రామపంచాయతీ రేగుళ్ల నుంచి గొడుగుబండకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గత ఐదేళ్లుగా రహదారి సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి పూర్తిగా దెబ్బతిని అడుగడుగునా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి చెరువును తలపిస్తోంది. వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి రహదారి ఎక్కడ ఉందో, గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీంతో నిత్యం రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం స్పందించకపోవడంపై గ్రామ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయమైన రహదారిని కూడా కల్పించలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రేగుళ్ల–గొడుగుబండ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అవసరమైన నిధులు మంజూరు చేసి నూతన రహదారి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల రహదారి కష్టాలకు ఇకనైనా మోక్షం లభిస్తుందా? అధికారుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!








