కరకగూడెం వైపు ఇసుక లారీలు వస్తే చర్యలు తప్పవు
లారీ డ్రైవర్లకు ఎస్ఐ పీవీ ఎన్ రావు హెచ్చరిక
కరకగూడెం, ఆగస్టు 11 (ఆధాబ్ న్యూస్):
పలు రోజులుగా వందల సంఖ్యలో ఇసుక లారీలు కరకగూడెం మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు సోమవారం గొళ్లగూడెం వద్ద ఇసుక లారీలను అడ్డుకుని తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా లారీ డ్రైవర్లకు కరకగూడెం మీదుగా ఇసుక లారీల రాకపోకలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇసుక లారీలకు అధికారులు నిర్ణయించిన రూట్లోనే ప్రయాణించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా కరకగూడెం వైపు లారీలను తీసుకువస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పీవీ ఎన్ రావు డ్రైవర్లను హెచ్చరించారు.
భారీ సంఖ్యలో ఇసుక లారీలు రాకపోకలు సాగించడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు ఉల్లంఘించే ఇసుక లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.









