ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం: చుంచు రామకృష్ణ (DE)
ఆధాబ్ న్యూస్, కరకగూడెం ఆగస్టు 6:
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ ఆదివాసీ ర్యాలీ, సాంస్కృతిక ప్రదర్శనలు, బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ (DE) పిలుపునిచ్చారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేపట్టిన జోడా యాత్రలో భాగంగా గురువారం ఆయన కరకగూడెం మండల కేంద్రంలో పర్యటించి స్థానిక ఆదివాసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల ఉనికి, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానం, రాజ్యాంగం కల్పించిన హక్కులను చాటిచెప్పే చారిత్రాత్మక దినమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్, పీసా (PESA) చట్టం, అటవీ హక్కుల చట్టం–2006 వంటి చట్టాలు ఆదివాసీల రక్షణ కోసం రూపొందించినప్పటికీ, వాటి సంపూర్ణ అమలుకు ఇంకా కృషి అవసరమని అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ హక్కులపై పూర్తి అవగాహనతో ఐక్యంగా ముందుకు సాగితేనే రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో సాధించగలరని తెలిపారు.
ఆగస్టు 9న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి, డోలు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో వేలాదిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు, ఆదివాసీ నాయకులు ఐక్యంగా పాల్గొని ఆదివాసీల ఐక్యతను ప్రపంచానికి చాటాలని కోరారు.
అనంతరం మండల నాయకులతో సమావేశమై ఆగస్టు 9 కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, గ్రామాల వారీగా ప్రజల సమీకరణ, రవాణా సౌకర్యాలు, ప్రచార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ప్రజలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, వివిధ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మండలంలోని పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.









