ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
ఆధాబ్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 5:
జిల్లావ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పూరి గుడిసెలు, అర్హులైన లబ్ధిదారుల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఎంపీడీవోలు, తహసీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, మండల స్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, పూరి గుడిసెల సర్వే పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సర్వేను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించిన కలెక్టర్, ప్రతి అర్హ కుటుంబం సర్వేలో నమోదయ్యేలా ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలను సేకరించాలని ఆదేశించారు. అర్హత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
మండలాల వారీగా ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత ఆధారంగా వెంటనే పరిశీలించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌కు గల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, ప్రతిరోజూ సర్వే పురోగతిని పర్యవేక్షిస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
గ్రామస్థాయిలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించి సర్వే పనులు నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తి చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం లేదా జాప్యానికి తావు ఉండరాదని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నాణ్యత, పారదర్శకత, వేగానికి ప్రాధాన్యం ఇచ్చి సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.









