నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
తెలంగాణ ఉద్యమకారుడు.. రైతు బాంధవుడు.. ప్రజలతో మమేకమైన నాయకుడికి వీడ్కోలు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్ జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం 12:51 నిమిషాలకు సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజం కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చురుకుగా పనిచేశారు. 2014లో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేదు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందుతూ నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా సేవలందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారు.
ఆయన హయాంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి, తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారం, విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన వ్యవసాయ సమస్యలపై ఎల్లప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటర్మీడియట్ విద్యను వరంగల్ మహబూబియా పంజతన్ కళాశాలలో పూర్తి చేశారు. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా కూడా ప్రజాసేవలో పనిచేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో ఓటమి పాలైనప్పటికీ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించారు. సరళమైన జీవనశైలి, గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.









