ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
వరద ప్రవాహాలు, చెరువులు, వాగులు, కుంటలకు దూరంగా ఉండాలని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సూచన
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ జూలై 30: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో కరకగూడెం మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు, వరద ప్రవాహ ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని సూచించారు. రైతులు పొలాల్లో పనులు నిర్వహించే సమయంలో విద్యుత్ తీగలు, నీటి ప్రవాహాలు, ప్రమాదకర ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే విద్యార్థులు వర్షాల సమయంలో బయట సంచరించకుండా తల్లిదండ్రుల సూచనలు పాటించాలని తెలిపారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం జరిగినా వెంటనే 9347149313 నంబర్‌కు సమాచారం అందించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు.









