భారీ వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం
రానున్న 36 గంటల్లో భారీ వర్షాల అవకాశం – ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్ : రానున్న 36 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. భారీ వర్షాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బుధవారం సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పరిస్థితులను సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు తమ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నదులు, వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రవహించే నీటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత తాగునీటి సరఫరా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరం సూచనలు అందించాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ అంతరాయం ఏర్పడినా ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రసవ సమయం సమీపించిన గర్భిణీలను ముందుగానే సమీప ఆసుపత్రులు లేదా గర్భిణీ వసతి కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు.









