అమర్నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదం.. 39 మంది భక్తులకు గాయాలు
సింధ్ నదిలో పడకుండా తప్పిన బస్సు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
గందర్బల్ (జమ్మూ-కాశ్మీర్), ఆధాబ్ న్యూస్: అమర్నాథ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తులతో వెళ్తున్న బస్సు జమ్మూ-కాశ్మీర్లోని గందర్బల్ జిల్లా కంగన్ ప్రాంతంలో మంగళవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 39 మంది యాత్రికులు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హరిగన్వాన్ సమీపంలోని మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో, బస్సు రహదారి పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టింది. దీంతో బస్సు సమీపంలోని సింధ్ నదిలో పడిపోకుండా తప్పించుకోవడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.
సమాచారం అందుకున్న స్థానికులు, భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందిస్తూ, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.









