విద్యార్థుల పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఆధాబ్ న్యూస్, హైదరాబాద్, జూలై 25
దేశవ్యాప్తంగా విద్యార్థులు ఐక్యంగా చేపట్టిన ఉద్యమ ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఈ విజయానికి ఏ రాజకీయ పార్టీ కారణం కాదని, పూర్తిగా విద్యార్థుల ఐక్యత, పట్టుదల, ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటమే కారణమని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులు సంకల్పిస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలరని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తే ప్రభుత్వాలనూ తలవంచించగలరని ఈ పరిణామం మరోసారి నిరూపించిందని మల్లన్న అన్నారు. విద్యార్థి శక్తి ముందు అధికార పార్టీల అహంకారం నిలవదని వ్యాఖ్యానించారు.
ఈ ఉద్యమం దేశంలోని అన్ని ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడే ప్రభుత్వాలు ఇకపై ప్రజల ఉద్యమాలకు, ముఖ్యంగా విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలకు సమాధానం చెప్పక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థుల ఉద్యమానికి తొలి నుంచి మద్దతుగా నిలిచిందని, విద్యార్థుల హక్కులు, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం తమ పార్టీ భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు.









