సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, పీకే ఓసీ గని సందర్శన.. కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణపై దిశానిర్దేశం
మణుగూరు, జూలై 24 (ఆధాబ్ న్యూస్): సింగరేణి సంస్థ ప్రయోజనాల పరిరక్షణ, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాకులను సాధించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సింగరేణి అధికారులకు సూచించారు.
శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి ముందుగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు వినియోగం, భద్రతా ప్రమాణాలు, యంత్రాల నిర్వహణ, సెంట్రల్ కంట్రోల్ యూనిట్ పనితీరును పరిశీలించారు. ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చేపడుతున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డి.ఏ.వి. పాఠశాలను ప్రారంభించారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే చర్యలను అభినందించారు.
తదుపరి మణుగూరు ప్రకాశ్ ఖని (పీకే ఓసీ) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని సందర్శించిన భట్టి విక్రమార్క గనిలో జరుగుతున్న తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, భద్రతా ప్రమాణాలు, యంత్రాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గని చరిత్ర, బొగ్గు నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గనిలో బొగ్గును స్వయంగా పరిశీలిస్తూ దాని నాణ్యతను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముకలాంటి సంస్థ అని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, రానున్న బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి చురుకుగా పాల్గొని కొత్త బ్లాకులను దక్కించుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
అధికారులు తాడిచెర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడంతో ఉద్యోగులు, కార్మికుల్లో ఆనందం నెలకొందని వివరించారు. అలాగే సంస్థ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్ను కూడా సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు.
దీనిపై స్పందించిన భట్టి విక్రమార్క, సింగరేణి అభివృద్ధి, విస్తరణ, కొత్త బొగ్గు బ్లాకుల సాధన, ఉద్యోగుల సంక్షేమం, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు వంటి అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌సీసీఎల్ సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, టీఎస్‌జెన్‌కో సీఎండీ హరీష్, ఎస్‌సీసీఎల్ డైరెక్టర్ గౌతమ్ పొట్రూ, సింగరేణి, టీఎస్‌జెన్‌కో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









